సినీ పరిశ్రమలో మరో విషాదం జరిగింది. ప్రముఖ నటుడు, డైరెక్టర్ ప్రతాప్ పోతెన్ (70) కన్నుమూశారు. చెన్నైలోని తన నివాసంలో విగత జీవిగా పడిపోయి వున్నారు. ఈయన మృతికి కారణాలు మాత్రం తెలియడం లేదు. మరోవైపు.. ఈయన మరణాన్ని మలయాళ హీరో పృధ్విరాజ్ సుకుమారన్ ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ ట్వీట్ చేశారు. ఈయన తెలుగు, తమిళ సినిమాల్లో కూడా నటించారు. తెలుగులో ఆకలి రాజ్యం, మరో చరిత్ర, కాంచనగంగ, డబ్బు డబ్బు డబ్బు, అమాయకుడు కాదు అసాధ్యుడు, వీడెవడు లాంటి సినిమాల్లో నటించాడు.
ప్రతాప్ పోతెన్ నటుడిగా కాకుండా పలు చిత్రాలకు డైరెక్టర్ గా నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఇటీవలే విడుదలైన మలయాళ చిత్రం సీబీఐ5 లో చివరి సారిగా తెరపై కనిపించారు. ఒట్టు, మూసా, మోహన్ లాల్ తొలిసారిగా దర్శకత్వం వహిస్తున్న బరోజ్ చిత్రాల్లో నటిస్తున్నారు. మరోవైపు 1985 లో ప్రముఖ నటి రాధికను ఈయన వివాహం చేసుకున్నారు. అయితే.. యేడాదిలోనే అంటే 1986 లోనే రాధికకు విడాకులు ఇచ్చారు. ఇక.. ప్రతాప్ పోతన్ మృతికి సినిమా ఇండస్ట్రీ నివాళులు అర్పిస్తోంది.