తమిళ నటుడు పొన్నంబలం తన సొంత సోదరుడిపైనే సంచలన ఆరోపణలకు దిగాడు. తన సొంత తమ్ముడే తనకు విషం పెట్టి చంపాలనుకున్నాడని పేర్కొన్నాడు. అయితే… మద్యం తాగడం వల్లే తన కిడ్నీలు పాడైపోయాయంటూ ప్రచారం జరిగిందని, కానీ… అది కాదని, తన సొంత తమ్ముడే తనపై విష ప్రయోగం చేశాడని అన్నాడు. తన తండ్రికి నలుగురు భార్యలని, మూడో భార్య కొడుకును తన సొంత తమ్ముడిగా భావించి మేనేజర్‌గా పెట్టుకున్నట్లు వెల్లడించారు.
తన వృత్తిపరమైన విషయాలన్ని తనే చూసుకునే వాడని, అయితే ఒకసారి తాను తాగే బీరులో స్లో పాయిజన్ కలిపాడంటూ వెల్లడించాడు. అంతేకాకుండా విషం కలిపిన ఆహారాన్ని పెట్టేవాడని, దాంతో కొంతకాలానికి నా కిడ్నీలు పాడైపోయాయని సంచలన విషయాన్ని పేర్కొన్నాడు. ఇక అప్పుడు డాక్టర్‌లను సంప్రదిస్తే విష ప్రయోగం వల్లే ఇలా జరిగిందని తెలిపారు. అయితే అతను అలా చేశాడన్న విషయం ఇటీవలే తెలిసిందని పొన్నంబలం చెప్పుకొచ్చాడు.
కిడ్నీలు ఫేయిల్ అవడంతో కిడ్నీ మార్పిడి చేయాలని డాక్టర్‌లు సూచించారని, దాంతో తన బంధువు ఒకతను కిడ్నీ దానం చేశాడని పొన్నంబలం చెప్పాడు. అయితే ఆ సమయంలో తనను ఆర్థికంగా చిరంజీవి ఆదుకున్నారని తెలిపాడు. చికిత్స కోసం కావాల్సినంత డబ్బు లేకపోవడంతో ఎవరిని అడగాలో, ఏం చేయాలో అర్థం కాని సమయంలో చిరంజీవి గారు గుర్తుకు వచ్చాడని పొన్నంబలం తెలిపాడు.