తెలుగు చిత్రపరిశ్రమకు, సినీ నటి మీనా కుటుంబానికి ఊహించని షాక్ తగిలింది. హీరోయిన్ మీనా భర్త విద్యా సాగర్ (48) మృతిచెందారు. గత కొంత కాలంగా ఆయన చెన్నైలోని ఎంజిఎం ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. కరోనా తర్వాత వచ్చే ఆరోగ్య సమస్యలతో ఆయన సతమతమవుతున్నారు. అయితే ఆస్పత్రిలో కొన్ని రోజులుగా ఆయన చికిత్స పొందుతుండగా.. ఒక్కసారిగా ఆరోగ్యం విషమించింది దీంతో ఆస్పత్రిలోనే తుదిశ్వాస విడిచారు. విద్యాసాగర్ మరణంతో మీనా కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
మీనా- విద్యాసాగర్ వివాహం జూలై 12,2009 లో జరిగింది. మీనా భర్త బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నారు. వీరిద్దరిదీ పెద్దలు కుదిర్చిన వివాహమే. వీరికి ఓ పాప కూడా వుంది. ఆ పాప పేరు నైనిక. ఇక… విద్యా సాగర్ మరణించారన్న వార్త తెలియడంతో పరిశ్రమకు చెందిన ప్రముఖులు.. బంధువులు వారింటికి తరలి వచ్చారు. విద్యాసాగర్ మరణంపై సీనియర్ నటుడు శరత్ కుమార్ ట్వీట్ చేశాడు. ఇదో షాకింగ్ ఘటన అని అన్నాడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశాడు.