నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి ఆరోపణలు, ఫోన్ ట్యాప్ నేపథ్యంలో వైసీపీ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ నెల్లూరు రూరల్ ఇంచార్జీ పదవి నుంచి ఎమ్మెల్యే కోటంరెడ్డిని వైసీపీ అధిష్ఠానం తప్పించింది. ఆయన స్థానంలో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని నియమించింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి క్యాంప్ ఆఫీసులో భేటీ అయ్యారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను పూర్తిగా చర్చించారు. అధిష్ఠానం ఏ బాధ్యతలు అప్పజెప్పినా… నిర్వర్తించేందుకు సిద్ధంగా వున్నానని ఎంపీ ఆదాల సీఎం జగన్ కి హామీ ఇచ్చారు.
దీంతో ఆయన్ను నెల్లూరు రూరల్ ఇంచార్జీగా నియమిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నామని సీఎం జగన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇక…. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచే ఆదాల ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తారని కూడా వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కీలక ప్రకటన చేశారు. సీఎంను కలిసిన తర్వాతే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ… రూరల్ ఇంచార్జీగా నియమించడం సంతోషంగా వుందన్నారు. వైసీపీ గెలుపు కోసం పనిచేస్తానని తెలిపారు. ఇకపై నెల్లూరు రూరల్ లో అన్ని కార్యక్రమాలూ ఆదాల ప్రభాకర్ రెడ్డి సారథ్యంలోనే జరుగుతాయని ఎమ్మెల్యే బాలినేని ప్రకటించారు.
వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. టీడీపీలోకి వెళ్లాలని ఆయన నిర్ణయించుకున్నారని, అందుకే తీవ్ర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆయనపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఆయనే తన ఉద్దేశాలు చెప్పిన తర్వాత చర్యలేం తీసుకుంటాం? అని వ్యాఖ్యానించారు. అయితే.. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు.