తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు అపోలో ఆస్పత్రిలో 75రోజుల పాటు అందించిన చికిత్సలో ఎలాంటి లోపాలు లేవని ఎయిమ్స్ వైద్యనిపుణుల కమిటీ తేల్చింది. ఈ మేరకు ఆమె మృతిపై విచారణ జరుపుతున్న జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ సంఘానికి నివేదికను సమర్పించింది. జయ లలిత మరణంపై అనేక సందేహాలు వెలువడ్డాయి. పెద్ద పెద్ద ఆరోపణలే వచ్చాయి. ఈ నేపథ్యంలో అప్పటి ముఖ్యమంత్రి ఎడప్పాడి పళని స్వామి హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ముగస్వామి నేతృత్వంలో విచారణ కమిషన్‌ను నియమించారు.
అప్పటి నుంచి ఆ కమిషన్ మొత్తం 157 మందిని క్షుణ్ణంగా విచారించింది. ఇందులో పలువురు ప్రముఖులు కూడా వున్నారు. నవంబర్ 2021లో ఈ కమిషన్ విచారణకు సాయం చేయడం కోసం సుప్రీం కోర్టు ఎయిమ్స్ డాక్టర్లతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఆగస్టు 4న రిపోర్ట్ చేసిన ఈ ప్యానెల్.. మాజీ సీఎంకు అందించిన చికిత్స సరైందేనని.. ఎలాంటి పొరపాట్లూ దొర్లలేదని పేర్కొంది. 2016 డిసెంబర్ 5న చెన్నైలోని అపోలో హాస్పిటల్స్‌లో తమిళనాడు మాజీ సీఎం జయలలిత మరణించిన సంగతి తెలిసిందే.