టాటా గ్రూప్ సారథ్యంలోని ఎయిరిండియా సంస్థ ఎయిర్ బస్ తో భారీ ఒప్పందమే చేసుకుంది. అమెరికాలోని బోయింగ్ నుంచి మొత్తం 470 కొత్త విమానాలను కొనుగోలు చేయాలని ఎయిరిండియా నిర్ణయించింది. ఈ మేరకు ఆయా సంస్థలతో ఒప్పందాలు కూడా చేసుకుంది. కేంద్రం నుంచి ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ కొనుగోలు చేసిన తర్వాత ఇచ్చిన తొలి ఆర్డర్ ఇదేనని పేర్కొన్నారు. ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ విమాన తయారీ సంస్థ ఎయిర్ బస్ నుంచి 250 విమానాలను, అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ నుంచి మరో 220 విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది.
40 ఎయిర్ బస్ ఏ350 విమానాలు, 20 బోయింగ్ 787 విమానాలు, 10 బోయింగ్ 777-9 విమానాలు, 210 ఎయిర్ బస్ ఏ 320/321 నియో విమానాలు, 190 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు కొంటున్నామని ఎయిర్ ఇండియా ప్రకటించింది. మొదటి విమానం ఈ యేడాది ఆఖర్లో సర్వీసులో చేరుతుందని కూడా పేర్కొంది. 2025 జూలై నుంచి విమానాలు తమకు అందుతాయని పేర్కొంది.
ఎయిర్ బస్ నుంచి 250 విమానాలను కొనడానికి సంతకాలు చేశామని టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ ప్రకటించారు. ఎయిర్ బస్ నుంచి 210 నారో బాడీ విమానాలు, 40 వైడ్ బాడీ విమానాలు కొంటున్నామని తెలిపారు. ఇక… ఎయిర్ బస్, బోయింగ్ తో ఎయిరిండియా ఒప్పందాలు చేసుకోవడంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. ఇదో మైలు రాయి అని అభివర్ణించారు. భారత్ లో విమాన రంగం దూసుకుపోతోందని, 15 సంవత్సరాల్లో 2 వేలకు పైగా విమానాలు అవసరమని చెప్పారు. దేశంలో గత 8 సంవత్సరాల్లో ఎయిర్ పోర్టుల సంఖ్య 74 నుంచి 147 కి పెరిగిందన్నారు. ఉడాన్ పథకం కింద మారుమూల ప్రాంతాలను సైతం విమానాల ద్వారా అనుసంధానం చేస్తున్నామని వివరించారు.