రెండు తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, బెంగాల్ లాంటి రాష్ట్రాలు విపరీతంగా అప్పులు చేసేస్తున్నాయని కేంద్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. స్థాయికి మించి అప్పులు చేయడం వల్లే శ్రీలంకకు దుర్గతి పట్టిందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ వివరించారు. శ్రీలంక సంక్షోభంతో పాటు కొన్ని రాష్ట్రాలు చేస్తున్న అప్పులపై కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. శ్రీలంక పర్యవసనాలు, వివిధ రాష్ఠ్రాలు చేస్తున్న అప్పులపై కేంద్రం ప్రజెంటేషన్ ఇస్తూ.. పై విధంగా వ్యాఖ్యానించారు. ఏపీ, బిహార్, హర్యానా, జార్ఖండ్, కేరళ, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, యూపీ, బెంగాల్ ఆర్థిక క్రమశిక్షణను పాటించాల్సిందేనని కేంద్రం తేల్చి చెప్పింది. యూపీ రుణాలు జీఎస్డీపీలో 32 శాతానికి చేరుకుందని పేర్కొంది. ఇక.. తెలంగాణ రుణాలు జీఎస్డీపీలో 25 శాతానికి చేరుకున్నాయని కేంద్రం వివరించింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయ, వ్యయాలు, అప్పుల మధ్య వ్యత్యాసం, బడ్జెటేతర రుణాలు ఎంత తీసుకున్నారు? ఆస్తుల తాకట్టు, డిస్కం, జెన్ కోలకు చెల్లించాల్సిన బకాయిల గురించి సవివరంగా ఇందులో పేర్కొన్నారు.
తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఆయా రాష్ట్రాల ఎంపీలు…
శ్రీలంక పరిస్థితులు వివరించడానికి అని పిలిచి, రాష్ట్రాల అప్పుల గురించి చెబుతారా? అంటూ పలు రాష్ట్రాల ఎంపీలు ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, డీఎంకే, టీఎంసీల సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కేంద్రం చేసిన అప్పులను కూడా చెప్పాలంటూ డిమాండ్ చేశారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత 95 లక్షల కోట్లు అప్పు జేసిందని, దాని గురించి కూడా ప్రపంచానికి చెప్పాలని వారు డిమాండ్ చేశారు. సమయం, సందర్భం లేకుండా రాష్ట్రాల అప్పులపై ప్రజెంటేషన్ ఇవ్వడం ఏంటని ఎంపీ నామా నిలదీశారు. తెలంగాణ తలసరి ఆదాయంలో దేశంలోనే రెండో స్థానంలో వుందని వివరించారు. ప్రతిపక్షాలు మాత్రమే అధికారంలో వున్న రాష్ట్రాల అప్పులు గురించి మాట్లాడుతున్నారని, ఇదేం పద్ధతి అని ఎంపీలు మండిపడ్డారు.