ఏపీలోని భీమవరంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకోనుంది. ఒకే వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం జగన్, మెగాస్టార్ చిరంజీవి కనిపించనున్నారు. స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామ రాజు 125 వ జయంతి ఉత్సవాల సందర్భంగా జూలై 4 న ప్రధాని మోదీ ఏపీలో పర్యటిస్తారు. భీమవరంలోని అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఇదే కార్యక్రమానికి హాజరు కావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏపీలోని ప్రముఖులకు ఆహ్వానాలు పంపారు. ఇందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవికి కూడా కిషన్ రెడ్డి ఆహ్వానం పంపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డే ఆహ్వానం పంపడంతో ఈ కార్య్రక్రమంలో పాల్గొనేందుకు చిరంజీవి ఓకే చెప్పారు.
ఇక సీఎం జగన్ కూడా పాల్గొంటారు. దీంతో ఒకే వేదికపై ప్రధాని, చిరంజీవి, సీఎం జగన్ కనిపిస్తారు. మరో వైపు ప్రధాని మోదీ రానుండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జూలై 1,2,3 తేదీల్లో హైదరాబాద్ లో జరగనున్నాయి. జూలై 3న హైదరాబాద్ లో జరిగే బహిరంగ సభలో మోదీ పాల్గొంటారు. జూలై 4న బేగంపేట విమానాశ్రయం నుంచి బయల్దేరి విజయవాడ చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో భీమవరం చేరుకుంటారని అధికారులు తెలిపారు.
అల్లూరి విగ్రహం ప్రత్యేకతలివే…
జూలై 4న ప్రధాని మోదీ చేతుల మీదుగా అల్లూరి సీతారామ రాజు విగ్రహ ఆవిష్కరణ జరగనుంది. ఈ విగ్రహం భీమవరంలోని ఏఎస్ఆర్ నగర్లోని మున్సిపల్ పార్కులో వుంది. ఈ విగ్రహాన్ని 3 కోట్ల ఖర్చుతో తయారు చేశారు. 15 టన్నుల బరువు వుంటుంది. 30 అడుగుల ఎత్తు. అల్లూరి విగ్రహాన్ని ఎత్తులో నిర్మించిన కాంక్రీట్ దిమ్మెపై దీనిని నిలబెట్టారు. పాలకొల్లు మండలం ఆగర్రు గ్రామానికి చెందిన అల్లూరి సీతారామరాజు సహకారంతో తయారు చేయించారు.