ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. సభ మొదలవగా స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలను చేపట్టారు. బీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (CM Jaganmohan reddy) సభ ముందు ఉంచనున్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మాణాన్ని ఎమ్మెల్యే కొలుసు పార్ధసారధి సభలో ప్రవేశపెట్టనున్నారు. అనంతరం ధన్యవాదాలు తెలిపే తీర్మాణంపై మాజీ మంత్రి కన్నబాబు మాట్లాడనున్నారు. తరువాత గవర్నర్ ప్రసంగానికి ముఖ్యమంత్రి జగన్ ధన్యవాదాలు తెలుపనున్నారు.
అయితే… వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అసెంబ్లీలో నిరసనకు దిగారు. తన నియోజకవర్గ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసనకు దిగారు. మైక్ ఇచ్చే వరకూ అసెంబ్లీలో అడుగుతూనే వుంటానని స్పష్టం చేశారు. సమస్యలు పరిష్కరిస్తే సీఎం జగన్ ను అభినందిస్తానని పేర్కొన్నారు. అయితే… కోటంరెడ్డి తీరుపై మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా విరుచుకుపడ్డారు.సభను అడ్డుకోవడానికే కోటంరెడ్డి వచ్చారని, చంద్రబాబు, టీడీపీ కోసమే ఆయన పనిచేస్తున్నారని మండిపడ్డారు. కోటంరెడ్డి టీడీపీతో చేతులు కలిపారని, దురుద్దేశంతోనే అసెంబ్లీలో ఆందోళన చేస్తున్నారని ఆరోపించారు. నైతిక విలువలు లేని నేత కోటంరెడ్డి అని, మెప్పుకోసమే మాట్లాడుతున్నారన్నారు. నమ్మక ద్రోహం చేసిన వారికి పుట్టగతులుండవ్ అంటూ మంత్రి అంబటి ఆక్రోశం వెళ్లగక్కారు.
మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలపై సభలోనే ప్రభుత్వాన్ని నిలదీసేందుకు టీడీపీ రెడీ అయ్యింది. మరోవైపు ఈరోజు అసెంబ్లీలో జరుగునున్న ప్రశ్నత్తరాల్లో కీలక ప్రశ్నలను టీడీపీ సభ్యులు అడుగనున్నారు. . రాష్ట్రంలో ప్రక్రుతి సేధ్యం ప్రోత్సాహానికి తీసుకున్న చర్యలపై ప్రశ్నించనున్నారు. అలాగే రాష్ట్రంలో విద్యుత్ తీగలు తెగడంతో ప్రమాదాలు జరగుతున్న విషయం వాటి నిర్వహణ లోపాలపై టీడీపీ సభ్యులు ప్రశ్నించనున్నారు. ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి వెచ్చించిన మొత్తం ఎంత, వాటి పురోగతిపై ప్రశ్నించనున్నారు.