ఓ మంత్రిగా సాంకేతిక అంశాలు తెలియాల్సిన అవసరమే లేదని ఏపీ జలవనరుల మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సాంకేతిక అంశాలు తెలియకపోయినా… తనకు కామన్ సెన్స్ వుందని, దేశంలో వున్న ఆరోగ్య మంత్రులు ఆస్పత్రుల్లో ఆపరేషన్లు చేస్తారా? అంటూ ఎదురు ప్రశ్నించారు. అమరావతిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అంబటి రాంబాబు మాట్లాడారు. పోలవరం ఎత్తుతో తెలంగాణకు నష్టం లేదన్నారు. ముంపు ప్రాంతాలను ఆర్డినెన్స్ ద్వారా ఏపీలో కలిపారని, ఈ విషయాన్ని గమనంలోకి తీసుకోవాలన్నారు. గోదావరికి భారీగా వరదలు వచ్చినా… ప్రాణ నష్ఠం జరగకుండా చూసుకున్నామని మంత్రి వివరించారు. వరద బాధితులకు 2 వేల చొప్పున చెల్లించామని గుర్తు చేశారు.
తమ ప్రభుత్వం వచ్చాకే.. పోలవరం స్పిల్ వే, అప్రోచ్ ఛానల్ పూర్తి చేశామన్నారు. పోలవరం విషయంలో టీడీపీది తప్పుడు ప్రచారం అని దుయ్యబట్టారు. పోలవరం జాప్యానికి జగన్ ప్రభుత్వం కారణమని బ్రాండింగ్ చేయడానికి టీడీపీ, దాని అనుకూల మీడియా ప్రయత్నాలు చేస్తోందని అంబటి ఆరోపించారు. కాఫర్ డ్యాం లేకుండా డయా ఫ్రమ్ వాల్ కట్టిన ఘనులు టీడీపీ నేతలని, స్పిల్ వే నిర్మాణం లేకుండా డయాఫ్రమ్ వాల్ ఎందుకు కట్టారంటూ ఫైర్ అయ్యారు. 400 కోట్లతో కట్గిన డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందని, దానిని ఎలా పునరుద్ధరించాలా? అని నిపుణులు తలలు పట్టుకుంటున్నారని అంబటి వివరించారు.