హక్కుల గురించి ఇతర దేశాలకు లెక్చర్లు దంచే అమెరికా.. తన దాకా వచ్చే సరికి అగ్రరాజ్య బుద్ధిని చూపించుకుంది. 50 ఏళ్లుగా మహిళలకు అందుబాటులో వున్న రాజ్యాంగపరమైన రక్షణకు బ్రేక్ వేసింది. అబార్షన్ ను దేశ వ్యాప్తంగా చట్గబద్ధం చేస్తూ వెలువడిన తీర్పును అమెరికా సుప్రీంకోర్టు కొట్టేసింది. గర్భ విచ్ఛిత్తిని నిషేధించే విషయంలో ఆయా రాష్ట్రాలు స్వయంగా నిర్ణయాలు తీసుకోవచ్చని న్యాయస్థానం తీర్పునిచ్చింది.
5-3 మెజారిటీతో ఈ తీర్పు వెలువడింది. దీంతో అమెరికాలో దాదాపు 25 రాష్ట్రాలు అబార్షన్ పై త్వరలోనే నిషేధం అమలులోకి రానుంది. అయితే ముగ్గురు లిబరల్ న్యాయవాదులు మాత్రం దీనిని వ్యతిరేకించారు. ఈ తీర్పు కోట్ల మంది మహిళలు వారికున్న ప్రాథమిక, రాజ్యాంగ రక్షణను కోల్పోయారని న్యాయమూర్తులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని తాము సమ్మతించడం లేదన్నారు.
తప్పుబట్టిన బైడెన్, ఒబామా
అబార్షన్ విషయంలో అమెరికా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తప్పుబట్టారు.అబార్షన్ విషయంలో మహిళల హక్కులను కాపాడేందుకు తన అదికారాలను ఉపయోగించుకుంటూ.. అవసరమైన మేరకు ప్రయత్నం చేస్తానని అమెరికా ప్రజలకు హామీ ఇచ్చారు. ఓ మహిళ, వైద్యుడు తీసుకునే నిర్ణయంలో రాజకీయ నేతల జోక్యం ఎంత మాత్రమూ సరైనది కాదని బైడెన్ తేల్చి చెప్పారు. ఇక.. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా తీర్పును తప్పుబట్టారు. స్వేచ్ఛపై దాడే అని అభివర్ణించారు. లక్షల మంది అమెరికన్ల ఆవశ్యకతమైన స్వేచ్ఛపై దాడి చేసింది అంటూ ఒబామా విరుచుకుపడ్డారు. ఇక మాజీ ప్రథమ పౌరురాలు మిషెల్లీ ఒబామా కూడా తప్పుబట్టారు. మహిళల ప్రాణాలకు ముప్పు పొంచివుందన్నారు.
రోయ్ 1973 ప్రకారం అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మొదటి రెండు త్రైమాసికాల్లో అబార్షన్ లకు అనుమతి వుంటుంది. అయితే తాజాగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో సగానికి సగం పైగా రాష్ట్రాలు కఠిన అబార్షన్ చట్టం తీసుకొచ్చే అవకాశాలు మెండుగా వున్నాయి. అయితే ఈ తీర్పుపై అమెరికాతో సహా పలు దేశాలు తీవ్ర నిరసనను వ్యక్తం చేస్తున్నాయి.