తెలంగాణ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ కు చేరుకున్నారు. బేగంపేట ఎయిర్ పోర్టులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు ఇతరులు షా కు ఘనంగా స్వాగతం పలికారు. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి అమిత్ షా నేరుగా సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి దేవాలయానికి వెళ్లారు. ఆలయ అర్చకులు షాకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం సికింద్రాబాద్ లోని సాంబమూర్తి నగర్ కాలనీ కళాసిగూడలో వున్న బీజేపీ సీనియర్ కార్యకర్త సత్యనారాయణ ఇంటికి వెళ్లారు. అమిత్ షాకు స్థానిక కార్పొరేటర్ స్వాగతం పలికారు. అనంతరం కేంద్ర హోం మంత్రిని బీజేపీ కార్యకర్త సత్యనారాయణ తన ఇంట్లోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం సత్యనారాయణ అందించిన వేడివేడి కాఫీని షా తాగారు.కాఫీ తాగుతూ.. సత్యనారాయణ బాగోగులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మునుగోడు సభలో పాల్గొనడానికి అమిత్ షా బయల్దేరారు.