బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ కాన్వాయ్ పై కొందరు కర్రలతో, రాళ్లతో దాడి చేశారు. దీంతో ఆయన కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి సమీపంలో ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరిని చూసేందుకు వచ్చారు. ఈ సమయంలోనే అర్వింద్ గో బ్యాక్.. అంటూ వాళ్లు నినాదాలు చేశారు. ఆయన కారు అద్దాలను పగులగొట్టి, ఆయనపై దాడికి దిగారు. ఈ ఘటనపై ఎంపీ అర్వింద్ ఘాటుగా స్పందించారు. ప్లాన్ ప్రకారమే తనపై దాడి జరిగిందని, కార్యకర్తలపైనా దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఈ దాడి వెనుక స్థానిక ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఉన్నారని ఎంపీ ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని, అందుకే ఇలా చేస్తోందంటూ మండిపడ్డారు. అయితే.. ఎన్నికల సమయంలో తమకు బ్రిడ్డి కట్టిచ్చి ఇస్తామని అర్వింద్ హామీ ఇచ్చారని, దానిని అమలు చేయలేదని గ్రామస్థులు ఆరోపించారు.
అర్వింద్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్
మరోవైపు ఈ దాడిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరా తీశారు. ఎంపీ అర్వింద్ కు అమిత్ షా ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్లాన్ ప్రకారమే తనపై దాడి జరిగిందని, కార్యకర్తలపైనా దాడులు జరుగుతున్నాయని అమిత్ షాకు అర్వింద్ వివరించారు. బీజేపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా అధికార టీఆర్ఎస్ దాడులు చేస్తోందని అమిత్ షాకు చెప్పారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో అర్వింద్ ఎక్కడ తిరిగిన దాడులు జరపాలని టీఆర్ఎస్ నాయకత్వం ఎమ్మెల్యేలకు ఆదేశాలను ఇచ్చిందని అర్వింద్ ఆరోపించారు.