దేశ వ్యాప్తంగా అత్యంత సంచలనం రేపిన సీఏఏ అంశం తాజాగా మళ్లీ తెరపైకి వచ్చింది. బెంగాల్ నేత సుబేందు అధికారి తదితరులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో పార్లమెంట్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగానే సీఏఏ అంశం వారికి మధ్య ప్రస్తావనకు వచ్చింది. కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తైన తర్వాత సీఏఏను కచ్చితంగా అమలు చేస్తామని ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ విషయాన్ని బెంగాల్ ప్రతిపక్ష నేత సుబేందు అధికారి వెల్లడించారు.
కోవిడ్ 19 వ్యాక్సినేషన్ పంపిణీ పూర్తవగానే దేశంలో సీఏఏను అమలు చేస్తామని అమిత్ షా మాతో చెప్పారు అంటూ సుబేందు వెల్లడించారు. పాకిస్తాన్, బంగ్లా, అఫ్గాన్ నుంచి భారత్ కు వలసొచ్చిన వారికి ఇక్కడి పౌరసత్వం ఇవ్వాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. అక్కడి మైనారిటీ హిందూ, సిక్కు, జైన్, బౌద్ధ, పార్సీ, క్రిస్టియన్ మతాలకు చెందిన వారికి ఇక్కడ పౌరసత్వం ఇచ్చేందుకు సీఏఏ సవరణ చట్గాన్ని తీసుకొచ్చింది. అయితే.. 2014 డిసెంబర్ 31 లోపు వచ్చిన వారికి మాత్రమే ఇవ్వాలని డిసైడ్ అయ్యారు.