గుజరాత్ అల్లర్ల కేసులో అప్పటి సీఎంగా వున్న మోదీ అనేక ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవంటూ తాజాగా సుప్రీం కోర్టు ప్రధాని మోదీకి క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంపై తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ఓ జాతీయ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. 19 సంవత్సరాల పాటు మోదీ పడిన ఆవేదన, బాధను తాను దగ్గరి నుంచి చూశానని చెప్పుకొచ్చారు. శివుడు తన గొంతులో గరళాన్ని నింపుకున్నట్లుగా మోదీ ఈ వేదనను భరించారని వర్ణించారు. గుజరాత్ అల్లర్లపై కొందరు విషప్రచారం చేశారని మండిపడ్డారు.
కావాలనే నరేంద్ర మోదీపై విమర్శలు చేశారని, కానీ ఈ విమర్శల జడివాన నుంచి మోదీ బయటపడ్డారని ఆనందం వ్యక్తం చేశారు. గుజరాత్ అల్లర్ల కేసులో ఆయనకు క్లీన్ చీట్ ఇవ్వడం ఎంతో ముదావహమని వ్యాఖ్యానించారు. సిట్ విచారణను తాము ఎంత మాత్రమూ ప్రభావితం చేయలేదని, దర్యాప్తు అంతా సుప్రీం కోర్టు పర్యవేక్షణలోనే జరిగిందన్నారు. ఈ కేసు తమ పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీసిందని, కానీ సుప్రీం తీర్పుతో అంతా కొట్టుకుపోయిందని అమిత్ షా అన్నారు.
తనపై వచ్చిన ఆరోపణలపై 19 సంవత్సరాల పాటు ఒక్కటంటే ఒక్క మాట కూడా మోదీ మాట్లాడలేదు. శివుడు తన గొంతులో విషాన్ని నింపుకున్నట్లుగా ఆ బాధను భరిస్తూ వచ్చారు. మోదీ పడ్డ ఆవేదనను నేను దగ్గరి నుంచి చూశా. ఎంతో సంకల్పం కలిగి వుంటేనే అలా మౌనంగా ఉండటం సాధ్యమవుతుంది అంటూ అమిత్ షా చెప్పుకొచ్చారు.