జూనియర్ ఎన్టీఆర్, అమిత్ షా భేటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. జనసేన బీజేపీ మధ్య పొత్తు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్‌తో భేటీ కాకుండా.. అమిత్ షా తారక్‌తో ఎందుకు సమావేశం అవుతుండటం పలు ఊహాగానాలకు కారణమైంది. ఇటీవల రిలీజైన ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమురం భీమ్ పాత్రలో తారక్ అద్భుత నటనతో యావత్ భారతావనిని అక్కట్టుకున్నాడు. ఆయన యాక్టింగ్ నచ్చడంతో.. అమిత్ షా కలవాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ ఇది కేవలం అభినందించడం కోసం మాత్రమే కాదని.. అంతకు మించి ఏదైనా వ్యూహం ఉండొచ్చనే భావన వ్యక్తం అవుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తారక్‌ను వాడుకొని పక్కనబెట్టారనే భావన ఆయన అభిమానుల్లో ఉంది. జూనియర్ ఎన్టీఆర్ చేతికి పార్టీ పగ్గాలు అప్పగిస్తేనే.. టీడీపీకి పునర్వైభవం సాధ్యమనే భావన ఇప్పటికీ చాలా మంది కార్యకర్తల్లో ఉంది. మంచి వాగ్ధాటి ఉన్న ఎన్టీఆర్.. తన తాత ఎన్టీఆర్లాగే జనాలను ఆకర్షించగలరని గతంలోనే రాజకీయ పరిశీలకులు అంచనాకొచ్చారు. ఈ నేపథ్యంలో తారక్‌తో అమిత్ షా భేటీ రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అదీగాక ఏపీలో బీజేపీ, జనసేన మధ్య పొత్తు ఉంది. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్‌ను కలవకుండా.. జూనియర్ ఎన్టీఆర్‌ను కలవాలని అమిత్ షా భావించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. బీజేపీ, జనసేన మధ్య పొత్తు ఉన్నప్పటికీ.. ఎవరికి వారే అన్నట్టుగా పరిస్థితి ఉంది. ప్రధాని మోదీ భీమవరం సభకు పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వీడ్కోలు కార్యక్రమానికి జనసేనానికి ఆహ్వానం పంపినప్పటికీ.. ఆరోగ్య కారణాల రీత్యా రాలేకపోతున్నానని పవన్ గతంలో తెలిపారు. ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తుంటే.. బీజేపీ, జనసేన విడిపోతాయేమోననే అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని గతంలో జనసేన డిమాండ్ చేయగా.. బీజేపీ నుంచి ఆశించిన రీతిలో స్పందన రాకపోవడమే దీనికి నిదర్శనమనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. జనసేన, బీజేపీ మధ్య పొత్తు ఉన్నప్పటికీ.. కమలం పార్టీతో వైఎస్సార్సీపీ సన్నిహితంగా మెలుగుతోంది. ఈ విషయం జనసైనికులకు రుచించడం లేదు. కానీ రాజకీయ అవసరాల దృష్ట్యా బీజేపీ సైతం జగన్‌కు ప్రాధాన్యం ఇస్తోంది.
