వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ పాగా వేయడం ఖాయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఎవరెన్ని అడ్డంకులు చేసినా.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో తమదే అధికారమని స్పష్టం చేశారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన బీజేపీ సంకల్ప సభలో అమిత్ షా ప్రసంగించారు. కేటీఆర్ ను సీఎం చేయడం ఎలా? అన్నదే సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని షా అభ్యర్థించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తాము మద్దతిచ్చామని, గతంలో తాము 3 రాష్ట్రాలను ఏర్పాటు చేసినప్పుడు ఎలాంటి సమస్యలూ రాలేదని గుర్తు చేశారు.
కుమారుడు కేటీఆర్ ను సీఎం చేయడానికే సీఎం కేసీఆర్ సచివాలయానికి వెళ్లడం లేదని విమర్శించారు. పగలు, రాత్రి సీఎం కేసీఆర్ అదొక్కటే ఆలోచిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ప్రగల్భాలు పలికారని, ఇప్పుడేమో చేయడం లేదన్నారు.
ఒవైసీకి భయపడే సీఎం కేసీఆర్ చేయడం లేదని సెటైర్ వేశారు. తెలంగాణ సచివాలయానికి సీఎం కేసీఆర్ వెల్లడం లేదని, బీజేపీ ముఖ్యమంత్రే తెలంగాణ సచివాలయానికి వెళ్తారని అమిత్ షా ప్రకటించారు. సీఎం కేసీఆర్ ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా… బీజేపీదే అధికారమని ఈ సభ వేదికగా అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.