కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత ఆనంద్ శర్మ కీలక పదవికి రాజీనామా చేసేశారు. హిమాచల్ పీసీసీ స్టీరింగ్ కమిటీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ లేఖను పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి పంపారు. తనను పిలవకుండానే పార్టీ స్టీరింగ్ కమిటీ సమావేశాలను నిర్వహిస్తోందని, తనతో కనీసం సంప్రదింపులు కూడా జరగడం లేదని మండిపడ్డారు. ఇలా చేయడం ద్వారా తన ఆత్మ గౌరవం దెబ్బతిన్నదని, ఆత్మ గౌరవం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఆనంద్ శర్మ తేల్చి చెప్పారు.
అయితే… పార్టీ తరపున ప్రచారం చేస్తానని హామీ ఇచ్చారు. కొన్ని రోజుల క్రితం సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ కూడా ఇలాగే చేశారు. జమ్మూ కశ్మీర్ ప్రచార కమిటీ చైర్మన్ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈ పదవిని చేపట్టినట్టే చేపట్టి… కాసేపటికే రాజీనామా చేసి, పార్టీకి ఝలక్ ఇచ్చారు. ఇప్పుడు ఆనంద్ శర్మ కూడా ఇదే బాటలో నడిచారు. అయితే… వీరిద్దరి రాజీనామాపై పార్టీ ఎలాంటి స్పందనా వ్యక్తం చేయలేదు.