దేశంలో సహకార ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఇందులో భాగంగా రాబోయే 5 సంవత్సరాల్లో గ్రామ పంచాయతీల్లో 2 లక్షల ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, పాడి మత్స్య సహకార సంఘాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ జరిగింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 99,000 పీఏసీలుగా వుండగా… అందులో 63 వేలు మాత్రమే చురుగ్గా పనిచేస్తున్నాయి. మిగతా 1.6 లక్షల పంచాయతీల్లో పీఏసీలు లేవు. అందుకే రాబోయే ఐదేళ్లలో 2 లక్షల పీఏసీలను ఏర్పాటు చేసి, రైతుల ఆదాయం పెంచడంతో పాటు గ్రామాల్లో ఉపాధి అవకాశాలు కల్పించాలని కేంద్రం నిర్ణయించుకుంది.
అలాగే… వైబ్రెంట్ విలేజెస్ పేరిటన నూతన పథకానికి కూడా ఆమోదం తెలిపింది. 2022-2023 నుంచి 2025-2026 దాకా మూడేళ్లలో 4,800 కోట్లతో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. దీనిని సరిహద్దు గ్రామాల్లోని రోడ్ల నిర్మాణానికి ఉపయోగిస్తారు. దేశ సరిహద్దుల్లో వున్న గ్రామాల డెవలప్ మెంట్ కోసం వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ అన్న పథకాన్ని తెచ్చారు. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమని ప్రకటించారు. ఈ స్కీమ్ కింద నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాలు కలుగుతాయి.
ఇక… కేంద్ర పాలిత ప్రాంతమైన లద్దాఖ్ సరిహద్దు ప్రాంతాలను దేశంలోని ఇతర ప్రాంతాలను అనుసంధానించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. ఈ అనుసంధానానికి 4.1 కిలోమీటర్ల పొడవైన షింకున్ లా సొరంగం నిర్మాణానికి కేబినెట్ ఓకే చెప్పింది. నిమూ పదామ్ దర్చ రోడ్ లింకులో 1,681 కోట్లతో సొరంగం నిర్మిస్తారు. 2025డిసెంబర్ కల్లా దీనిని పూర్తి చేస్తారు. ఈ ప్రాజెక్టు దేశ భద్రతకు చాలా కీలకమని అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు.