ప్రతిపక్షాలపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్రంగా విరుచుకుపడ్డారు. స్పీకర్ స్థానంలో వుంటూ వైసీపీ ప్లీనరీకి ఎలా హాజరవుతారంటూ కొన్ని పత్రికలు రాశాయని ఆయన ఉటంకించారు. గతంలో స్పీకర్ గా వుండి.. కోడెల శివప్రసాద్ టీడీపీ మహానాడుకు హాజరు కాలేదా? అంటూ సూటిగా ప్రశ్నించారు. ఆ రోజు ఆయన మాట్లాడింది వినలేదా? అంటూ ఫైర్ అయ్యారు. కోడెల మహానాడుకు హాజరవగా లేనిది, తాను హాజరైతే తప్పా? అంటూ మండిపడ్డారు.
తాను వైసీపీ ప్రాథమిక సభ్యుడినని, తర్వాతే ఎమ్మెల్యేను, తర్వాతే స్పీకర్ ను అంటూ విస్పష్ట ప్రకటన చేశారు. ప్లీనరీ జరుగుతుంటే తాను ఇంట్లో కూర్చోవాలా? అంటూ తమ్మినేని సీతారాం నిలదీశారు.
సీఎం జగన్ తో ప్రయాణించేందుకు తామంతా సిద్ధంగా వున్నామని స్పీకర్ తమ్మినేని అన్నారు. సంక్షేమ రథాన్ని ఇలాగే ముందుకు తీసుకెళ్లాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి 175 స్థానాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ గడపకు వెళ్లినా.. సీఎం జగన్ పేరే వినిపిస్తోందన్నారు. మూడేళ్ల ప్రగతిపై సమీక్షించుకోవడానికే ప్లీనరీ అని స్పీకర్ తమ్మినేని ప్రకటించారు.