పోలవరం అంశాన్ని వివాదం చేసే కుట్ర నడుస్తోందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు గురించి టీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని, దీని గురించి మాట్లాడితే.. తెలంగాణ ఏర్పాటు గురించి ప్రశ్నించినట్లేనని సోము వీర్రాజు మెలిక పెట్టారు. అంతేకాకుండా మొత్తం రాష్ట్ర విభజన అంశాన్ని తిరగదోడినట్లు అవుతుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన బిల్లు ప్రకారం పోలవరం నిర్మాణం చేయాలని, ఈ ప్రాజెక్టును కేంద్రమే పూర్తి చేస్తుందని భరోసా ఇచ్చారు. పోలవరం విషయంలో సీఎం జగన్ ప్రజలను మోసం చేస్తున్నారని, గతంలో చంద్రబాబు కూడా ఇలాంటి ప్రకటనలే ఇచ్చి దెబ్బతిన్నారని అన్నారు. చంద్రబాబు అవినీతిపరుడంటూ సీఎం జగన్ పదే పదే అంటున్నారని, మరి వాటిని ఎందుకు బయటపెట్టలేదని సోము వీర్రాజు సూటిగా ప్రశ్నించారు.
ఇక… పేదలకు కేంద్రం ఇచ్చిన రేషన్ బియ్యాన్ని జగన్ ప్రభుత్వం అసలు పంపిణీ చేయడం లేదని సోము వీర్రాజు ఆరోపించారు. లక్షా నలబై వేల కార్గులు వైసీపీ ప్రభుత్వం ఇచ్చిందని, ఈ సమయంలో కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకున్నారా? అంటూ ప్రశ్నించారు. కాకినాడ కేంద్రంగా బియ్యం అక్రమ రవాణా సాగుతోందని, ఇతర దేశాలకు ఇక్కడి నుంచే వెళ్తున్నాయని సోము మండిపడ్డారు. బియ్యం అవినీతి ఎలా జరుగుతందో ప్రజలకు వివరిస్తామని, పేద ప్రజల బియ్యాన్ని పందికొక్కుల్లా తింటారా? అంటూ సోము వీర్రాజు తీవ్ర పదజాలం వాడారు.