ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రపంచంతో ఏపీ పిల్లలు పోటీ పడేలా విద్యా రంగంలో బైజూస్ తో జరిగిన అతిపెద్ద ఒప్పందానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వం బైజూస్ కంటెంట్ ను పొందుపరిచి, పాఠ్య పుస్తకాలను కూడా ముద్రించనుంది. వీడియో కంటెంట్ ద్వారా పిల్లలు నేర్చుకునేందుకు గాను.. నాడు- నేడు కింద ప్రతి తరగతి గదిలో టీవీలు ఏర్పాటు చేస్తోంది.
2. వంశధార ప్రాజెక్టులో నిర్వాసిత కుటుంబాలకు సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు అదనపు పరిహారంగా 216.71 కోట్ల పంపిణీకి సంబంధించిన జారీ చేసిన ఉత్తర్వులను కూడా ఏపీ కేబినెట్ ఆమోదించింది.
3. యూనివర్శిటీలు, కార్పొరేషన్లు, సొసైటీ ఉద్యోగులకు పీఆర్సీ వర్తింపజేస్తూ గతంలో మంత్రుల కమిటీ చేసిన సిఫార్సుల మేరకు తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
4. 70 ఏళ్లు పైబడిన పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 2019 జూలై 1 నుంచి 2020 మార్చి 31 వరకూ ఇచ్చిన ఐఆర్ ను రికవరీ చేయకూడదన్న ప్రతిపాదనకు ఆమోదం.
5. అర్జున అవార్డు గ్రహీత, ప్రముఖ ఆర్చర్ జ్యోతి సురేఖ వెన్నంకు గ్రూప్-1 సర్వీసు కింద డిప్యూటీ కలెక్టర్ పోస్టులో నియమకానికి సంబంధించి అసెంబ్లీ ప్రవేశపెట్టే బిల్లును కూడా కేబినెట్ ఆమోదించింది.
6.విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో నిర్మిస్తున్న కొత్త వైద్య కళాశాలల్లో ఒక్కో కళాశాలలో 706 ఉద్యోగాల చొప్పున, మొత్తంగా 3,530 కొత్త పోస్టుల భర్తీకి కేబినెట్ ఓకే చెప్పింది.
7.వైద్య విధాన పరిషత్ కు సంబంధించి ఆస్పత్రుల్లో పడకల సంఖ్యకు అనుగుణంగా సిబ్బందిని ఉంచేందుకు వీలుగా అదనంగా మరో 2,558 పోస్టులకు గ్రీన్ సిగ్నల్.