ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశమైంది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను సమాచార మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ మీడియాకు వెల్లడించారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు.
అమ్మఒడి నిధులకు కూడా ఆమోదం తెలిపిందని, ఈ నెల 27 న సీఎం జగన్ అమ్మఒడి నిధులను విడుదల చేస్తారని తెలిపారు. ఆక్వా రైతులకు సబ్సిడీని మరింత మందికి వర్తింప జేసేలా చర్యలు తీసుకుంటామన్న విషయాన్ని కూడా కేబినెట్ చర్చించదన్నారు. 10 ఎకరాల వరకూ ఆక్వా సాగు చేసుకునే రైతులకుసబ్సిడీపై విద్యుత్ ను అందిస్తామని ప్రకటించారు.
ఇక..జిల్లాల పునర్విభజన నేపధ్యంలో 13 పాత జిల్లాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న జడ్పీ చైర్మన్లనే 26 జిల్లాలకు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. జిల్లాల విభజనకు సంబంధించిన సవరణలు, మార్పులు, చేర్పులతో కూడిన తుది నోటిఫికేషన్ కు ఆమోదం లభించిందని మంత్రి గోపాల కృష్ణ పేర్కొన్నారు.
2022 సంక్షేమ క్యాలెండర్ లో భాగంగా జూలై 5 న జగనన్న విద్యా కానుక, 13 న వాహన మిత్ర, 22 న కాపు నేస్తం, 26న జగనన్న తోడు పథకాలు అమలు అవుతాయన్నారు. అలాగే వివిథ పథకాలకు అర్హులై ఉండి.. మిగిలిపోయిన వారికి కూడా జూలై 19 న లబ్ధి చేకూరుస్తామని మంత్రి తెలిపారు. ఇక రాజ్ భవన్ లో 100 కొత్త పోస్టుల భర్తీకి కూడా కేబినెట్ గ్రీన్ సి్నల్ ఇచ్చింది.