వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. అది ఫేక్ వీడియో అంటూ ఎస్పీ ఫకీరప్ప ఇప్పటికే ప్రకటించారు. దీనిపై తాజాగా ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ కూడా స్పందించారు. ప్రైవేట్ ల్యాబ్ లకు సంబంధించిన నివేదికలు చట్టబద్ధం కాదని తేల్చి చెప్పారు. ఎక్లిప్స్ ల్యాబ్ పేరుతో కొందరు ఇచ్చిన సర్టిఫికేట్ ఫేక్ అని తేలిందని ప్రకటించారు. అసలైన సర్టిఫికేట్ తమ వద్ద వుందని, అది జిమ్ స్టాఫర్డ్ తనకు పంపించిందని వెల్లడించారు. తనకు అందిన మెయిల్ ప్రతిని ఆయన మీడియా ముఖంగా విడుదల చేశారు. టీడీపీ విడుదల చేసిన ఫోరెన్సిక్ రిపోర్టులో వాస్తవాలు లేవని అన్నారు.
అది ఇద్దరి మధ్య జరిగిన వీడియో కాల్. దీనిపై కొందరు ఫోరెన్సిక్ రిపోర్ట్ అని విడుదల చేశారు. ఆ వీడియోను ఎవరో షూట్ చేశారని, మూడో వ్యక్తి షూట్ చేసిన వీడియోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపి రిపోర్ట్ తీసుకున్నారని అన్నారు.వీడియో కంటెంట్ ఒరిజినలా కాదా అనేది ల్యాబ్ చెప్పలేదని, రిపోర్ట్‌ను మార్చి ప్రచారం చేశారని తెలిపారు. ప్రైవేట్ ల్యాబ్‌లు ఇచ్చే నివేదికలకు విలువ ఉండదని, మన ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చే నివేదికే ప్రామాణికమని సీఐడీ చీఫ్ తేల్చి చెప్పారు. వీడియో తనది కాదని ఎంపీ గోరంట్ల మాధవ్ చెప్పారని, మార్ఫింగ్ చేశారని ఎంపీ ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు. దీనిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ప్రకటించారు.