ఏపీ పోలీసు స్టాండింగ్ ఆర్డర్స్ ఆధారంగా రౌడీషీట్ తెరవడంపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పీఎస్ వో ఆధారంగా రౌడీషీట్ తెరవడం, సస్పెక్ట్ షీట్, హిస్టరీ షీట్ లాంటివి తెరవడం అసలు చెల్లదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు తీర్పు ఇచ్చారు. పోలీస్ స్టాండింగ్ ఆర్డర్స్ కు అసలు చట్టబద్ధత లేదని పేర్కొంది. పీఎస్ ఓ ప్రకారం ఫొటోల సేకరణ, వాటిని స్టేషన్లలో పెట్టడం, ఇళ్లను సందర్శించడం, స్టేషన్ కు పిలవడం, పీఎస్ లో గంటలకు గంటలు వేచి ఉండేలా చేయడం లాంటివి… వ్యక్తుల హక్కులకు విఘాతం కలిగించడమే అని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇలా చేయడం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని ఘాటుగా వ్యాఖ్యానించింది.
చట్టం అనుమతి లేకుండా రౌడీషీట్ లు తెరవొద్దని, వాటిని కొనసాగించవద్దని హైకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. పిటిషనర్లపై నమోదు చేసిన రౌడీషీట్లను తక్షణం మూసివేయాలని హైకోర్టు ఆదేశించింది. సుప్రీం కోర్టు, హైకోర్టులు ఇచ్చిన తీర్పులను మొత్తం విస్మరిస్తున్నారని, విస్మరించి రౌడీషీట్లు తెరుస్తున్నారని హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తగిన కారణాలు లేకుండానే రౌడీషీటర్ అని ముద్ర వేస్తున్నారని హైకోర్టు తీవ్రంగా మండిపడింది.