దేశంలోనే అత్యధిక పారిశ్రామిక పెట్టుబడులను ఏపీ ఆకర్షిస్తోందని మంత్రి చెల్లుబోయిన గోపాల కృష్ణ పేర్కొన్నారు. రాష్ట్ర జీఎస్ డీపీ 11.34 శాతంగా వుందని, జాతీయ సగటుతో పోలిస్తే ఏపీ చాలా ముందుందని వెల్లడించారు. తలసరి ఆదాయం 38.5 శాతం పెరిగిందని, 2022 జూలై నాటికి ఏపీకి 40,361 కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రకటించారు. దేశ వ్యాప్తంగా 1.71 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తే… అందులో ఏపీకే అత్యధికమని పేర్కొన్నారు. పరిపాలన సంస్కరణలో దేశానికే ఏపీ ఆదర్శంగా నిలిచిందన్నారు. పేదరికం రూపుమాపడమే సీఎం జగన్ లక్ష్యమని అన్నారు. సీఎం సారథ్యంలో పారిశ్రామికంగా రాష్ట్రం అభివృద్ధి సాగిస్తోందని పేర్కొన్నారు.
పెట్టుబడులను రాబట్టడంలో ఏపీ 5 వ స్థానంలో వుందని, అలయన్స్ టైర్స్ సంస్థ విశాఖలో 1,040 కోట్ల పెట్టుబడితో ఉత్పత్తిని ప్రారంభించడానికి ముందుకు వచ్చిందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లోనూ ఏపీ అగ్రస్థానంలో వుందని గుర్తు చేశారు. చంద్రబాబు పాలనలో వృద్ధి రేటు 5.36 శాతమేనని, అదే సీఎం జగన్ హయాంలో వృద్ధిరేటు 11.43 శాతానికి చేరిందన్నారు. రైతులను ఆదుకోవడానికి ఆర్బీకేలను ఏర్పాటు చేశామని, రైతులు మోసపోకుండా చర్యలు తీసుకున్న ఏకైక రాష్ట్రం ఏపీయేనని మంత్రి చెల్లుబోయిన గోపాల కృష్ణ పేర్కొన్నారు.