టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి విషయంపై ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు కౌంటర్ ఇచ్చారు. అయ్యన్న పాత్రుడి విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. చట్టానికి ఎవ్వరూ అతీతులు కాదన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. అయ్యన్న పాత్రుడి ఇంటి గోడ కూల్చడం కచ్చితంగా రాజకీయ కక్షే అంటూ టీడీపీ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో మంత్రి కారుమూరి స్పందించారు.
చంద్రబాబు బాటలోనే అయ్యన్నపాత్రుడు నడుస్తున్నారని ఎద్దేవా చేశారు. వ్యక్తిగతంగా అయ్యన్న పాత్రుడు తప్పుచేసి.. మొత్తం బీసీలపై రుద్దటం ఏంటని సూటిగా ప్రశ్నించారు. అయ్యన్న పాత్రుడు తప్పులు చేస్తే చూస్తూ ఊరుకోవాలా? అంటూ మండిపడ్డారు.
టీడీపీ చేస్తున్న అసత్య ప్రచారాలు, పిచ్చి మాటలు చూసి జనం నవ్వుకుంటున్నారని మంత్రి కారుమూరి ఎద్దేవా చేశారు. టీడీపీ నేతలు మహిళలు, ఎస్సీల గురించి దారుణమైన మాటలు మాట్లాడారని గుర్తు చేశారు. జగన్ వచ్చాకే బీసీలకు న్యాయం జరుగుతోందని, చంద్రబాబు హయాంలో వారిని కేవలం ఓట్లేసే యంత్రాలు గానే చూశారని కారుమూరి మండిపడ్డారు.