నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈడీ విచారణకు హాజరయ్యారు. దీనిని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ దేశ వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ఏపీలోనూ నిరసనలు కొనసాగాయి. ఏపీ పీసీసీ అధ్యక్షుడు సాకె శైలజానాథ్ నిరసనలో పాల్గొన్నారు. ఈయనతో పాటు ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి, తదితరులు హాజరయ్యారు. నేషనల్ హెరాల్డ్ కేసు మూసేసిన కేసని, అయినా… సోనియాను విచారణకు ఈడీ పిలిచిందని సాకె మండిపడ్డారు. తక్షణమే సోనియాపై విచారణకు ఆపాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు.
బీజేపీ దేశాన్ని నాశనం చేస్తోందని, బీజేపీ అకౌంట్లలో వేలాది కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గాంధీ కుటుంబంపై వేధింపులకు దిగుతోందని, ఇది దారుణమని మండిపడ్డారు. సోనియా, రాహుల్ అగ్ని పునీతలుగా బయటకు వస్తారని, ప్రత్యర్థులను ఇబ్బందులు పెట్టడానికి కేంద్రం దర్యాప్తు సంస్థలను వాడుతోందని సాకె శైలజానాథ్ మండిపడ్డారు. కావాలనే గాంధీ కుటుంబాన్ని బీజేపీ ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని తులసీ రెడ్డి మండిపడ్డారు.