రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ కి కాస్త బూస్ట్ దొరికిందని అధిష్ఠానం భావిస్తున్న తరుణంలో మహారాష్ట్ర కాంగ్రెస్ లో ముసలం పుట్టింది. పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేత మధ్య వివాదం ముదిరి, రాజీనామా దిశగా అడుగులు పడ్డాయి. పీసీసీ అధ్యక్షుడు నానా పటోలేతో తాను వేగలేనని సీఎల్పీ నేత బాలాసాహేబ్ థోరట్ పార్టీకి రాజీనామా చేసేశారు. పార్టీ నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి లేఖ కూడా రాసేశారు.
పీసీసీ చీఫ్ నానా పటోలే తనను అవమానాలకు గురి చేస్తున్నారని, తాను బీజేపీలో చేరుతున్నట్లు తప్పుడు వ్యాఖ్యలను ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇవన్నీ తట్టుకోలేకే… తాను పార్టీని వీడుతున్నానని లేఖలో వివరించారు. ఇక… పార్టీలో జరిగే కీలక సమావేశాలకు కూడా తనకు ఆహ్వానాలు అందడం లేదని, కావాలనే ఇలా చేస్తున్నారని ఆరోపించారు. తన కుటుంబ సభ్యులపై బహిరంగంగా వ్యాఖ్యలు చేశారన్నారు. సత్యజీత్ టంబే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడాన్ని ఉద్దేశపూర్వకంగానే మితిమీరి మాట్లాడారని ఆరోపించారు.