భారీ వర్షాలు పడటం వెనుక విదేశీ కుట్రలు వున్నాయని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించడంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు ఈ శతాబ్దపు జోక్ అంటూ బండి సంజయ్ ఎద్దేవా చేశారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి వ్యాఖ్యలంటూ ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ తప్పిదాల వల్లే కాళేశ్వరం మునిగిపోయిందని, వరదలపై ప్రజలను తప్పుదోవ పట్టించడానికే సీఎం కేసీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని బండి దుయ్యబట్టారు. వారం రోజులుగా వరదలతో ప్రజలు అల్లాడుతుంటే పట్టించుకోని సీఎం… ప్రాంతీయ పార్టీల నేతలతో మాత్రం ఫోన్లలో మాట్లాడతారంటూ బండి సంజయ్ ఫైర్ అయ్యారు.
ప్రాంతాలపై ఏటూరు నాగారం సమీక్షా సమావేశంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోని పలు ప్రాంతాల్లో క్లౌడ్ బస్టర్ సృష్టిస్తున్నట్లు తమకు తెలిసిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇతర దేశాల వారు ఈ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. గతంలో లద్దాఖ్, లేహ్, ఉత్తరాఖండ్ లో ఇలాగే జరిగిందంటూ ఉదహరించారు. ఇప్పుడు గోదావరి పరివాహక ప్రాంతాలపై కూడా ఇలాంటి కుట్రలు చేస్తున్నారంటూ సీఎం కేసీఆర్ ఆరోపించారు. భారీ వర్షాల వల్ల తలెత్తే ఉత్పాతానికి ఈ వరదలే నిదర్శనమంటూ అన్నారు.