బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని మంగళవారం అర్ధరాత్రి 12 గంటలకు పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో కూడా చెప్పకుండా, ఎలాంటి వారెంట్ కూడా లేకుండానే బలవంతంగా అదుపులోకి తీసుకున్నాయి. అసలు ఏ విషయంలో అరెస్ట్ చేస్తున్నారని బండి సంజయ్ పోలీసు అధికారులను అడిగినా…. పోలీసులు జవాబు చెప్పలేదు. సంజయ్ అత్తమ్మ చనిపోయి బుధవారానికి 9వ రోజు కావడంతో.. ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇంటికి చేరుకున్న కొద్దిసేపటికే ఈ ఘటన జరిగింది.
అయితే, పదో తరగతి ప్రశ్న పత్రాల లీకేజీ కేసులోనే సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. తనను ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాలని సంజయ్ కోరితే, అదుపులోకి తీసుకునే అధికారం తమకు ఉందంటూ పోలీసులు జవాబు ఇచ్చారని బీజేపీ వర్గాలు తెలిపాయి. తొలుత, అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత సుమారు 100 మంది పోలీసులు సంజయ్ ఇంటిని చుట్టుముట్టారు. ఆయన అరెస్టుకు ప్రయత్నించారు. అదే సమయంలో బీజేపీ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకున్నారు. దాంతో, బండి సంజయ్ నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
అయితే.. దీనిపై బీజేపీ వర్గాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఓ పార్లమెంట్ సభ్యుడ్ని, ఓ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడ్ని చెప్పా పెట్టకుండా, కారణం లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. బండి సంజయ్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచీ కక్షపూరితంగానే వుంటోందని ఆరోపించారు. బండి సంజయ్ అరెస్ట్ కు నిరసనగా.. ఏప్రిల్ 5వ తేదీ బుధవారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు పార్టీ శ్రేణులు.