బీజేపీ తెలంగాణ మహిళా మోర్చా ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మహిళా గోస- బీజేపీ భరోసా పేరిట దీక్ష చేపట్టారు. ఈ దీక్షను అధ్యక్షుడు బండి సంజయ్ ప్రారంభించారు. కేసీఆర్ తన ప్రభుత్వంలో మహిళలకు కనీస ప్రాధాన్యం ఇవ్వడం లేదని, దీక్షలు చేసే అర్హత కవితకు లేదన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులపై కేసీఆర్ కనీసం స్పందించలేదని మండిపడ్డారు. మహిళలకు ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ బీజేపీనని, విదేశీ, ఆర్థిక మంత్రుల బాధ్యతలను మహిళలకు ఇచ్చిన ఘనత తమదేనని ప్రకటించారు. ఎమ్మెల్సీ కవిత కారణంగా తెలంగాణ మహిళలు తలదించుకునే పరిస్థితి ఏర్పడిందని, కవిత పాపులారిటీ తగ్గుతుందనే పార్టీలోని ఇతర మహిళలకు ఛాన్స్ ఇవ్వరని ఆరోపించారు. ఇదంతా మరిచి కవిత ఢిల్లీలో దీక్షకు దిగారని, సఅలు ఆమె తెలంగాణలో వున్న ప్రగతి భవన్ ముందు ధర్నా చేయాలని సూచించారు. అప్పుడే ప్రజలు గుర్తిస్తారని బండి సంజయ్ చురకలంటించారు.
33 శాతం బీఆర్ఎస్ టికెట్లు మహిళలకు ఇవ్వనందుకు తన తండ్రి కేసీఆర్‌ను కవిత ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ 33శాతం రిజర్వేషన్ గురించి ఎందుకు పార్లమెంట్‌లో మాట్లాడలేదని ప్రశ్నించారు. కేసీఆర్ బిడ్డ కవిత వలన మహిళా లోకం తల దించుకునే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. తన దందాలో నుంచి కవిత పేద మహిళలకు వాటా ఇవ్వాలన్నారు. కేసీఆర్ క్యాబినెట్‌లో 33శాతం మహిళా మంత్రులు ఎందుకు లేరని నిలదీశారు. బీఆర్ఎస్ నాయకులే మహిళలకు శాపంగా మారారన్నారు.
లిక్కర్ కేసు నుండి తప్పించుకునేందుకే కవిత ఢిల్లీలో దీక్ష చేస్తోందని ఆరోపించారు. సీఎం ఇంటి ముందు కవిత ధర్నా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే మహిళలను అవమానిస్తున్నారని అన్నారు. సీఎం తీరుతో నే రాష్ట్రంలో మహిళలై వరుస ఘటనలు జరుగుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో 33 శాతం మహిళ రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.