ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల మనిషి అని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అభివర్ణించారు. దేశానికి మోదీ ఎంతో చేశారని చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీపై కేసీఆర్, టీఆర్ఎస్ నాయకులు తప్పుడు భాష వాడుతున్నారని, అయినా చూస్తూ ఊరుకోవాలా? అంటూ ప్రశ్నించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన విజయ సంకల్ప సభలో ఆయన భావోద్వేగంగా ప్రసంగించారు.
ప్రజల మనిషి మోదీ అని, ఆయన్ను ఎందుకు తిడుతున్నారని ప్రశ్నించారు. పేదలు ఆకలితో అలమటించొద్దని చెప్పి, ఉచిత బియ్యం ఇస్తున్నందుకా? 200 కోట్ల టీకా డోసులను దేశ ప్రజలకు ఉచితంగా ఇచ్చినందుకా? ఉక్రెయిన్ లో భారతీయులు, తెలుగు ప్రజలు ఇరుక్కుపోతే తిరిగి స్వదేశానికి తెచ్చినందుకా? అంటూ బండి సంజయ్ సూటిగా ప్రశ్నలు వేశారు.
సభికులందరూ ప్రధాని మోదీకి ఘనంగా స్వాగతం పలకాలని, గడీలో బందీగా మారిన తెలంగాణ తల్లి పులకరించిపోతుందని సంజయ్ వ్యాఖ్యానించారు. బీజేపీ సేన యుద్ధానికి సిద్ధమైందని, అందరూ లేచి జై మోదీ… జైజై మోదీ అంటూ నినాదాలు ఇవ్వాలని సూచించారు. భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా కేసీఆర్ గడీని బద్దలు కొట్టే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు.
గడీ పాలన నుంచి తెలంగాణ తల్లిని విముక్తి చేయాలని పిలుపునిచ్చారు. ఒక పథకం ప్రకారం మోదీని తిడుతున్నారని, మోదీని విమర్శించడం ద్వారా రాజకీయ లబ్ధికి చూస్తున్నారని బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ఈ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఇక్కడే ఎందుకు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారని, ఎందుకు నిర్వహించకూడదో చెప్పాలని పరోక్షంగా టీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు.