జనగామ వేదికగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సవాల్ విసిరారు. కేసీఆర్ కు దమ్ముంటే బలప్రదర్శనకు రావాలని సవాల్ విసిరారు. హిందూ ధర్మం కోసం బీజేపీ పనిచేస్తోందని, పేదల కోసం అవసరమైతే గూండాగిరి కూడా చేస్తామని స్పష్టం చేశారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా జనగామలో నిర్వహించిన సభలో బండి సంజయ్ ప్రసంగించారు. పోలీసులను అడ్డం పెట్టుకొని టీఆర్ఎస్ ప్రభుత్వం గూండాగిరి చేస్తోందని, పైగా తమల్ని విమర్శిస్తోందంటూ నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ దాడులకు తాము భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తమ పార్టీ ఏ సమూహానికి గానీ, ప్రాంతాలకు గానీ వ్యతిరేకం కాదని, ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే.. తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వుంటుందని బండి సంజయ్ హెచ్చరించారు.
పరేడ్ గ్రౌండ్‌లో మోదీ సభ చూశాక సీఎం కేసీఆర్ గడీ కదిలిందని సంజయ్ అన్నారు. అందుకే ప్రజాసంగ్రామ యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇటీవల జరిగిన సామూహిక గీతాలాపనలో స్వతంత్ర భారత్‌కీ జై అని ఒవైసీ అనలేదని గుర్తు చేశారు. కేసీఆర్‌కు దమ్ముంటే ఒవైసీతో భారత్ మాతాకీ జై అని అనిపించాలని సవాల్ విసిరారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తమ నియోజవర్గంలో కూడా ఉప ఎన్నికలు రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. భవిష్యత్తులో అధికారం కోల్పోతే లండన్, మస్కట్ పారిపోయేందుకే కేసీఆర్, కేటీఆర్ రూ.వేల కోట్లు దోచుకున్నారని విమర్శించారు.
జనగామకు పాదయాత్ర చేరుకున్న సందర్భంగా బండి సంజయ్ వివిధ వర్గాలను కలుసుకున్నారు. ఇందులో భాగంగా స్థానిక బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు ఆయనకు వినతి పత్రాన్ని అందజేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. భగవద్గీతను కించపరిస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. ఇమామ్ లకు ఇచ్చే గౌరవం అర్చకులకు ఇవ్వరా? అంటూ మండిపడ్డారు. అర్చకులు అడ్డాకూలీ వద్ద వుండే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే.. పేద బ్రాహ్మణులను ఆదుకుంటామని బండి సంజయ్ హామీ ఇచ్చారు.