వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, ప్రాజెక్టులు నిండి జన జీవనం అతలాకుతలమైంది. పలు జిల్లాలకు, గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. భద్రాచలంలో ప్రమాదకర స్థాయిలో గోదావరి ప్రవహిస్తోంది. 68 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరింది. ప్రస్తుతం 21 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోందని అధికారులు పేర్కొన్నారు. 36 ఏళ్ల తర్వాత భద్రాచలంలో మళ్లీ 70 అడుగులు గోదావరి నీటిమట్టం దాటుతోందని రికార్డులు చెబుతున్నాయి. ఛత్తీస్ గఢ్, ఒడిశా, ఏపీ మధ్య రాకపోకలు నిలిపేశారు.
భద్రాచలం గోదావరి బ్రిడ్డిపై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇప్పటికే 2 వేల కుటుంబాలను పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు. మరికొంత మందిని కూడా తరలిస్తామని పేర్కొంటున్నారు. భద్రాచలంలోని చుట్టు పక్కల ప్రాంతాలు మరో 48 గంటలు అప్రమత్తంగా వుండాలని అధికారులు హెచ్చరించారు. భద్రాచలం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే రోడ్లపైకి వరద నీరు వచ్చేసింది. గత 4 రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. ఇక… సహాయక చర్యలను మంత్రి అజయ్ కుమార్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. భద్రాచలంలోనే ఉండి, అధికారులకు సూచనలు ఇస్తున్నారు.