శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవం మూడు రోజుల పాటు జరుగనుంది.
ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఉదయం 10 నుండి 11 గంటల వరకు ఆలయ ముఖ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు. సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు ఊంజల్ సేవ జరిగింది. రాత్రి 8 నుండి 9 గంటల వరకు పెద్దశేష వాహనంపై స్వామి, అమ్మవార్లు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.