కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచిన వంటగ్యాస్ ధరలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని బీఆర్‌ఎస్ నిర్ణయించింది. గురు, శుక్రవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ, మండల, పట్టణ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కే తారకరామారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో అన్ని మండల, పట్టణ, నియోజకవర్గ కేంద్రాల్లో బీఆర్ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కేంద్రం పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలంటూ డిమాండ్ చేశారు.
బుధవారం కేటీఆర్ రాష్ట్ర మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ అధ్యక్షులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఆయా రాష్ర్టాల్లో ఎన్నికలు ముగియగానే ప్రతిసారీ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడం కేంద్ర ప్రభుత్వానికి ఆనవాయితీగా మారిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్రం ప్రజల కష్టాలను పట్టించుకోకుండా ధరలను పెంచుతున్న తీరును స్థానికంగా మీడియా ద్వారా ప్రజలకు చేరేలా చూడాలని బీఆర్‌ఎస్ శ్రేణులకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఒకవైపు ఉజ్వల సీం పేరుతో మాయమాటలు చెప్పిన బీజేపీ ప్రభుత్వం భారీగా గ్యాస్ ధరలను పెంచుతున్నదని, వారిని సిలిండర్‌కు దూరం చేస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు.
సామాన్యులపై మళ్లీ గ్యాస్ బండ భారం పడింది. వంట గ్యాస్, వాణిజ్య వినియోగానికి ఉపయోగించే గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూ చమురు సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. వంట గ్యాస్ సిలిండర్ ధర 50 రూపాయలకు పెరగ్గా… వాణిజ్యపరంగా ఉపయోగించే సిలిండర్ పై 350 రూపాయలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెరుగుతున్న ధరలు నేటి నుంచే అమలులోకి వస్తాయని చమురు సంస్థలు ప్రకటించాయి. ఇటీవలి కాలంలో పెట్రోలియం సంస్థలు ధరలను పెంచకుండా కాస్త రిలీఫ్ ఇచ్చాయి. కానీ… తాజాగా మళ్లీ గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో సామాన్యులు తెగ ఇబ్బందులు పడుతున్నారు.