‘కాఫీ డే’ అంటూ వ్యాపార రంగంలో కొత్త పుంతలు తొక్కి, గొప్ప వ్యాపారవేత్తగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వీజీ సిద్ధార్థ జీవితం ఇప్పుడు సినిమాగా రాబోతుంది. ఈయన జీవితంపై ఓ బయోపిక్ ను రూపొందిస్తున్నట్లు నిర్మాణ సంస్థలైన టీ సిరీస్, ఆల్మైటీ మోషన్ పిక్చర్చ, కర్మ మీడియా సంయుక్తంగా ప్రకటించేశాయి. అయితే సిద్ధార్థ పాత్రను ఎవరు పోషిస్తారన్నది మాత్రం ఇంకా తెలియడం లేదు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న రుక్మిణీ బీఆర్, ప్రొసెంజీత్ దత్తా రాసిన కాఫీ కింగ్ అన్న పుస్తకం ఆధారంగానే ఈ బయోపిక్ తెరకెక్కనుంది.
వ్యాపారంలో పీక్ స్థాయిలో ఉన్స మయంలోనే కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ నేత్రావతి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అప్పట్లో ఈ విషయం తెగ సంచలనం అయ్యింది. వ్యాపార లావాదేవీల్లో ఇరుక్కుపోవడం, ఇన్వెస్టర్లు, ఐటీ అధికారుల ఒత్తిళ్లు భరించలేకపోతున్నానని లేఖ రాసి, సిద్ధార్థ ఇంట్లోంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత కనిపించకుండా పోయిన సిద్ధార్థ కోసం చాలా వెతికారు. చివరికి మంగళూరుకు 350 కిలోమీటర్ల దూరంలోని నేత్రావతి నదిలో ఆయన మృతదేహం లభించింది.