బిహార్ సీఎం నితీశ్ కుమార్ బీజేపీతో కటీఫ్ చేయనున్నారని తీవ్ర ప్రచారం జరుగుతోంది. బీజేపీ వ్యవహార శైలి ఆయనకు ఏమాత్రం నచ్చడం లేదని, అందుకే తెగదెంపులు చేసుకోవాలన్న నిర్ణయానికి సీఎం నితీశ్ వచ్చినట్లు సమాచారం. శివసేన మాదిరిగానే జేడీయూలోనూ బీజేపీ చీలిక తేవడానికి ప్రయత్నాలు చేస్తోందని జేడీయూ ఆరోపిస్తోంది. ఆర్సీపీ సింగ్ మరో ఏకనాథ్ షిండేగా మారే అవకాశాలున్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే.. బీజేపీకి గుడ్ బై చెప్పేసి, ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు నితీశ్ పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా సీఎం నితీశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కూడా పోన్ చేసినట్లు సమాచారం. అంతా కుదిరితే.. 11 తేదీ కల్లా బిహార్ లో కొత్త ప్రభుత్వం రూపుదిద్దుకుంటుందని తెలుస్తోంది.
నెల రోజులుగా ఎడమొహం పెడమొహం
సీఎం నితీశ్ కుమార్ సుమారు ఓ నెల రోజులుగా బీజేపీతో సత్సంబంధాలు నెరపడం లేదు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ భేటీకి డుమ్మా కొట్టారు. అంతేకాకుండా రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా ప్రధాని మోదీ ఇచ్చిన విందును కూడా నితీశ్ బాయ్ కాట్ చేసేశారు. రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన ద్రౌపది ముర్ము కార్యక్రమానికి కూడా డుమ్మా కొట్టారు. ఇలా కొన్ని రోజులుగా సీఎం నితీశ్ బీజేపీతో కొంత గ్యాప్ మెయింటేన్ చేస్తున్నారు.
కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేస్తే స్వాగతిస్తాం : ప్రతిపక్షాలు
సీఎం నితీశ్ బీజేపీకి గుడ్ బై చెప్పేసి, కాంగ్రెస్, ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే… తాము స్వాగతిస్తామని కమ్యూనిస్టు పార్టీలు ప్రకటించాయి. తమకు 12 మంది ఎమ్మెల్యేలు వున్నారని, నితీశ్ కు మద్దతిస్తామని సీపీఐఎంఎల్ ప్రకటించింది. ఇక… నితీశ్ తో చేతులు కలపడానికి తాము కూడా సిద్ధమని ఆర్జేడీ ప్రకటించింది. కాంగ్రెస్ నుంచి కూడా సానుకూల సంకేతాలే వచ్చాయి.
బీజేపీతో జేడీయూ సంబంధాలను కట్ చేసుకుంటుందన్న వార్తల నేపథ్యంలో సీఎం నితీశ్ అధ్యక్షతన కీలక సమావేశం జరుగుతోంది. దీనికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ హాజరయ్యారు. మరోవైపు ఆర్జేడీ సమావేశం కూడా జరగనుంది. దీనికి మాజీ సీఎం, లాలూ భార్య రబ్రీ దేవీ హాజరయ్యారు.