తెలంగాణ రాష్ట్రానికి ప్రధాని మోదీయే ప్రధాన శత్రువంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. తెలంగాణకు ప్రథమ శత్రువు సీఎం కేసీఆరే అని బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీ రైతు రుమాలు కట్టుకుంటే కేసీఆర్ వెక్కిరించడాన్ని కొండా విశ్వేశ్వర రెడ్డి తప్పుబట్టారు. ఉచిత విద్యుత్ ఇవ్వవద్దని ప్రధాని ఎక్కడా చెప్పలేదని, ఇచ్చేది సక్రమంగా ఇవ్వాలని మాత్రమే కోరారని కొండా వివరించారు. సీఎం కేసీఆర్ పిట్టల దొరలా, తుపాకీ రాముడిలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఆయన.. కేసీఆర్ టోపీకి తగ్గ తుపాకీ పంపుతున్నట్లు కొండా ప్రకటించారు.
వికారాబాద్ సమీక్రుత కలెక్గరేట్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఆ తర్వాత జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ… మోదీపై విరుచుకుపడ్డారు. తెలంగాణకు ప్రధాన శత్రువు నరేంద్ర మోదీయేనని అన్నారు. దుర్మార్గుడైన మోదీని దేశం నుంచి తరిమికొట్టి అద్భుత భారతదేశాన్ని సృష్టించుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు. కల్లబొల్లి కథలు తప్ప ఆయన చెప్పిన ఏ ఒక్క వాగ్దానం నెరవేరలేదన్నారు. కుటుంబానికి రూ.15 లక్షలు ఇస్తామని చెప్పి 15 పైసలు కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు.