గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విషయంలో బీజేపీ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనపై అధిష్టానం వేటు వేసింది. బీజేపీ నుంచి రాజాసింగ్ ను సస్పెండ్ చేసింది. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని బీజేపీ హైకమాండ్ స్పష్టం చేసింది. అంతేగాక బీజేఎల్పీ పోస్ట్ నుంచి రాజాసింగ్‌ను అధిష్టానం తప్పించింది. హైద్రాబాద్ నగరంలో నిర్వహించిన మునావర్ షోను రాజాసింగ్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఓ వీడియోను కూడా అప్ లోడ్ చేశారు. ఓ వర్గం మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ ఫిర్యాదులతో పలు రాష్ట్రాల్లో కేసులు నమోదవుతున్నాయి.దీన్ని సీరియస్ గా తీసుకున్న హైకమాండ్ రాజాసింగ్ పై చర్యలు తీసుకుంది.
బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆయన్ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఎమ్మెల్యే రాజా సింగ్ ను అరెస్ట్ చేయాలంటూ ఎంఐఎం కార్యకర్తలు చాంద్రాయణ గుట్ట పీఎస్ ముందు నిరసలు చేశారు. బీజేపీ ఎమ్మెల్యేపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు రాజాసింగ్ ను అరెస్ట్ చేశారు.
అయితే… దీనిపై రాజాసింగ్ ఘాటుగా స్పందించారు. మునావర్ ఫారూఖీ రాముడ్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారని, అందుకే ఫారూఖీని కించపరుస్తూ తాను కూడా వీడియో చేస్తానని ముందే ప్రకటించానని గుర్తు చేశారు. రాముడ్ని కించపరుస్తూ షోలు నడిపించే వ్యక్తికి పోలీసు రక్షణ ఎలా కల్పిస్తారని సూటిగా ప్రశ్నించారు. యాక్షన్ కు రియాక్షన్ కచ్చితంగా వుంటుందని, ధర్మం కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. త్వరలోనే మరో యూట్యూబ్ వీడియో కూడా విడుదల అవుతుందని రాజాసింగ్ తేల్చి చెప్పారు.