మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో నేడు మునుగోడులో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ బహిరంగ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. మునుగోడు సమర భేరి సభ వేదికగా ఇటీవలే కాంగ్రెస్ కు రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధికారికంగా బీజేపీలో చేరనున్నారు. దీంతో ఈ సభకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. నిన్ననే అధికార టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో బీజేపీ సభకు మరింత ప్రాధాన్యం పెరిగినంది. మరోవైపు టీఆర్ఎస్ సభకు మించి జనాన్ని తరలించి మునుగోడు ప్రజలు తమ వైపే ఉన్నారనే స్పష్టమైన సంకేతాలను ఇచ్చేందుకు బీజేపీ సిద్ధమైంది.
అందుకే సభను సీరియస్ గా తీసుకుంది. రాష్ట్ర ముఖ్య నేతలంతా మూడ్రోజులుగా మునుగోడులోనే మకాం వేసి ప్రతి పల్లెను టచ్ చేస్తూ సభకు జనాన్ని తరలించడంపై ఫోకస్ పెట్టారు. సుమారు లక్ష మంది వరకు జనం తరలివస్తారని బీజేపీ అంచనా వేస్తున్నది. అందుకు తగిన ఏర్పాట్లలో ఉంది. ప్రధాన సభా వేదికపై అమిత్ షాతో పాటు జాతీయ, రాష్ట్ర ముఖ్య నేతలు ఉంటారు. ఈ వేదికకు కుడి, ఎడమ వైపున మరో రెండు వేదికలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక వేదికపై రాష్ట్ర ఆఫీసు బేరర్లు, నల్గొండ ముఖ్య నేతలు, ఇంకో వేదికపై సాంస్కృతిక బృందాల కళా ప్రదర్శనలు ఉంటాయి. వర్షం వచ్చినా అంతరాయం ఏర్పడకుండా జర్మన్ టెక్నాలజీ టెంట్లు వేస్తున్నారు.
అమిత్ షా టూర్ షెడ్యూల్ ఇదీ….
ఆదివారం మధ్యాహ్నం 3. 40 గంటలకు బేగంపేటఎయిర్ పోర్టుకు అమిత్ షా చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో సాయంత్రం 4.35 గంటలకు మునుగోడు వెళ్తారు. 4.50 గంటల వరకు సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులతో సమావేశమవుతారు. 4.50 నుంచి 6 గంటల దాకా సమర భేరి సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 6. 45కు రామోజీ ఫిలిం సిటీకి వెళ్తారు. 7.30 వరకు అక్కడే రామోజీరావుతో సమావేశమవుతారు. రాత్రి 8 గంటలకు శంషాబాద్ లోని నోవాటెల్ హోటల్ కు చేరుకుంటారు. రాత్రి 9.30 గంటల వరకు బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలతో సమావేశమవుతారు. ఆ తర్వాత శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి తిరిగి ఢిల్లీకి వెళ్లిపోతారు.