మునుగోడు ఉప ఎన్నికను తెలంగాణ బీజేపీ అత్యంత సీరియస్ గా తీసుకుంది. ఎలాగైనా… మునుగోడు బై పోల్ లో విజయం సాధించి, అధికార టీఆర్ఎస్ కు షాకివ్వడంతో పాటు తన బలాన్ని నిరూపించుకోవాలని డిసైడ్ అయ్యింది. ఇప్పటికే బీజేపీ మునుగోడుపై ద్రుష్టి సారించింది. బీజేపీ అగ్రనేతలు కూడా దీనిపై ద్రుష్టి సారించారు. ఇందులో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మునుగోడుకు రానున్నారు. ఈ నెల 21 న మునుగోడులో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నామని తెలంగాణ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జీ తరుణ్ ఛుగ్ ప్రకటించారు. ఈ భారీ బహిరంగ సభకు కేంద్ర హోంమంత్రి హాజరవుతారని వెల్లడించారు. ఈ సందర్భంగా భారీగా చేరికలు కూడా వుంటాయని, అన్ని పార్టీలకు చెందిన వారు చెరతారని ఛుగ్ ప్రకటించారు. ఇక… ఈ మీడియా సమావేశంలో ఆయన సీఎం కేసీఆర్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకునేందుకు సీఎం కేసీఆర్ కుట్రలు చేస్తున్నారంటూ రాష్ర్ట వ్యవహారాల ఇన్ చార్జ్ తరుణ్ చుగ్ మండిపడ్డారు. రాష్ర్టంలో బీజేపీ చేపడుతున్న సభలు, సమావేశాలను అడ్డుకోవాలని టీఆర్ఎస్ సర్కారు కుట్రలు చేస్తోందని ఆరోపించారు. అధికారం చేజారిపోతుందన్న ఆందోళనలో కేసీఆర్ ఉన్నారని, అందుకే ప్రజా సంగ్రామ యాత్రపై టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో దాడులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు అన్యాయం చేస్తోందని, కేసీఆర్ పరిపాలనలో జరుగుతున్న అన్యాయాలపై అమిత్ షా మాట్లాడుతారని చెప్పారు. దుబ్బాక, హుజురాబాద్ నియోజకవర్గాల్లో గెలిచినట్లుగానే మునుగోడులోనూ బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.