వచ్చే ఎన్నికల నాటికి టీఆర్ ఎస్, కాంగ్రెస్ పొత్తు ఖాయమని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎద్దేవా చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్ ఎస్ కాంగ్రెస్ కు మద్దతివ్వడమే ఇందుకు పెద్ద నిదర్శనమని అన్నారు. అయితే ఇది పొత్తుకు తొలి మెట్టు అని చెప్పుకొచ్చారు. బీజేపీ దళితుడిని రాష్ట్రపతి చేసిందని, ఇప్పుడు ఆదివాసీ బిడ్డను రాష్ట్రపతిని చేయబోతోందన్నారు.
కానీ.. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి, చేయలేదని అర్వింద్ మంత్రి కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ తెలంగాణలో లేకుండా పోయిందని, ఆత్మ గౌరవ భవనాలు ఎక్కడ వున్నాయని సూటిగా ప్రశ్నించారు. టీఆర్ ఎస్ ఆదివాసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, ఆదివాసీ మహిళ రాష్ట్రపతి కాకుండా టీఆర్ ఎస్ వ్యతిరేకంగా ఓటు వేస్తుందని మంత్రి కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు.
వచ్చే ఎన్నికల నాటికి టీఆర్ ఎస్, కాంగ్రెస్ కలిసే బరిలోకి దిగుతాయని, ఇంతకు బీఆర్ ఎస్ అంటూ బీరాలు పలికారని, అది ఎక్కడికి పోయిందని ఎంపీ అర్వింద్ సూటిగా ప్రశ్నించారు. కేసీఆర్ దేశమంతా తిరుగుతున్నారని, ప్రధాని, కేంద్ర మంత్రులు వస్తే పర్యాటకులా? అంటూ దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల కోసం పనిచేసే వారినే బీజేపీ చేర్చుకుంటుందని, భూకబ్జాలు, అవినీతికి పాల్పడే వారిని చేర్చకోమని అర్వింద్ ప్రకటించారు.