వచ్చే నెల హైదరాబాద్ లో జరిగే ప్రధాని మోదీ బహిరంగ సభకు సంబంధించిన పోస్టర్ ను బీజేపీ రాజ్యసభ సభ్యుడు, ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షుడు కె. లక్ష్మణ్ ఆవిష్కరించారు. దీని పేరు విజయ్ సంకల్ప్ సభ అని పేర్కొన్నారు. ఈ సభ చరిత్రలో నిలిచిపోతుందని లక్ష్మణ్ ప్రకటించారు. తెలంగాణ ప్రజలు డబుల్ ఇంజన్ సర్కారు కోరుకుంటున్నారని, మోదీ సభ తర్వాత తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మారబోతోందని ప్రకటించారు.
ఇక హైదరాబాద్ లో ఫ్లెక్సీ వ్యవహారంపై రాజకీయం చేస్తున్నారని లక్ష్మణ్ తీవ్రంగా మండిపడ్డారు. ఇదంతా చూస్తుంటే సీఎం కేసీఆర్ లో అభద్రతా భావం పెరిగిపోయిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ రాజకీయ బ్రోకర్లను నమ్ముకున్నారని, ఫ్లెక్సీ రాజకీయాలు చేసే స్థాయికి కేసీఆర్ దిగిపోయారని ఎద్దేవా చేశారు.
కుటుంబ, అవినీతి పాలన అంతమొదించడానికే మోదీ వస్తున్నారని అన్నారు. తమకు హోర్డింగులు పెట్టుకోవడానికి కూడా వీల్లేకుండా చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మెట్రో పిల్లర్లు కూడా కబ్జా చేశారని, అధికారం, డబ్బు వుందని చేస్తున్నారని, ప్రజలు గమనిస్తూనే వున్నారని లక్ష్మణ్ అన్నారు.