హైదరాబాద్ వేదికగా వచ్చే నెల 2,3 తారీఖుల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీతో సహా పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ అగ్రనేతలు, 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇప్పటికే ఓ దఫా సైబరాబాద్ పోలీస్ కమిషనర్, పలువురు ఉన్నతాధికారులతో బీజేపీ నేతలు సెక్యూరిటీ పరమైన రివ్యూ నిర్వహించారు.
అయితే.. రెండు రోజుల పాటు ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ లోనే వుంటున్న నేపథ్యంలో మాదాపూర్ లోని హెచ్ ఐసీసీ సహా దాని చుట్టు పక్కల ప్రాంతాలను హై సెక్యూరిటీ జోన్ గా ప్రకటించేందుకు పోలీసులు సమాయత్తమవుతున్నారు. వీవీఐపీలు వస్తున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయమని పోలీసులు పేర్కొంటున్నారు. ప్రధాని మోదీ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని నోవాటెల్, వెస్టిన్ లేదా ఐటీసీ కోహినూర్ హోటళ్లలో ఏదో ఒక హోటల్ లో బస చేస్తారని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి.
అయితే.. భద్రతాపరంగా అత్యంత సురక్షితమైన హోటల్ ఏదో ప్రధాని భద్రతా విభాగం నిర్ణయిస్తుందని, ఆ గ్రూప్ నిర్ణయం తర్వాతే తుది నిర్ణయమని కూడా పోలీసులు అంటున్నారు. అయితే.. ఈ మూడు హోటళ్ల పరిసర ప్రాంతాల్లో మాత్రం డేగా కళ్లతో పహారా వుంటుందని పోలీసులు పేర్కొంటున్నారు. మూడంచెల భద్రతను ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా ట్రాఫిక్ పోలీసు విభాగం కూడా అలర్ట్ అయ్యింది.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, ప్రధాని మోదీ బస చేసే ప్రాంతాల్లో ట్రాఫిక్ ను నియంత్రించే పనిలో నిమగ్నమైంది. దాదాపు 500 మంది ట్రాఫిక్ పోలీసులు దీనికి సంబంధించిన బందోబస్తులో పాల్గొననున్నారు. అంతేకాకుండా సైబరాబాద్ పరిధిలోని మాల్స్, రెస్టారెంట్లు, పబ్ లపై కూడా పోలీసులు ఆంక్షలు విధించే ఛాన్స్ వున్నట్లు తెలుస్తోంది. వీటికి వచ్చే రద్దీని నియంత్రించేందుకు పరిమిత సంఖ్యను కూడా సూచించే అవకాశాలున్నాయి.