హెచ్ ఐసీసీలో బీజేపీ ఆఫీస్ బేరర్స్ సమావేశం ప్రారంభమైంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. ఈ కార్యక్రమ వేదికపై బీజేపీ చీఫ్ నడ్డా, పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోశ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ వున్నారు. మొత్తం 148 మంది ఆఫీస్ బేరర్స్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ సంస్థాగత వ్యవహారాలపై చర్చిస్తున్నారు. అంతే కాకుండా జాతీయ కార్యవర్గ సమావేశాల ఎజెండా తీర్మానాలపై చర్చిస్తారు. ముసాయిదా తీర్మానాలను ఫైనల్ చేయనున్నారు.
మరోవైపు జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా పలు కీలక తీర్మానాలు చేయనున్నారు. ఎన్నికలు, పార్టీ విస్తరణ, కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రచారం.. ఈ మూడు అంశాలను బలంగా చర్చించనున్నారు. ఈ అంశాలపైనే ముఖ్యంగా ఫోకస్ పెట్టనున్నారు. వీటి అమలుకు ఓ రోడ్ మ్యాప్ ప్రతిపాదిస్తారు. మరోవైపు కార్యవర్గ సమావేశాలు నడుస్తున్న హైటెక్స్ లోకి పాసులు ఉన్నవారినే అనుమతిస్తున్నారు. ఎస్పీజీ, సీఆర్పీఎఫ్, ఆక్టోపస్ బలగాలను మోహరించారు.