తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు మహబూబ్ నగర్ లో జరుగుతున్నాయి. ఈ కార్యవర్గ సమావేశాలకు బీజేపీ రాష్ట్ర ఇంచార్జీ సునీల్ బన్సల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశాలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎమ్మెల్యేలు ఈటల, రఘునందన్, ఎంపీ లక్ష్మణ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని విమర్శించారు. సీఎం కేసీఆర్ కి ఏ ఒక్కరూ అప్పిచ్చే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ దివాలా తీసిందని, జీతాలు ఇచ్చే స్థితి కూడా లేదని ఆరోపించారు.మద్యం ద్వారా సంవత్సర కాలంలో 40 వేల కోట్ల ఆదాయం వచ్చిందని, అంటే ప్రభుత్వం మద్యాన్ని విచ్చలవిడిగా ప్రోత్సహిస్తుందన్నారు.
కొత్త కొత్త సంక్షేమ పథకాల పేర్లు చెప్పి.. లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడుతారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును ప్రజలందరికీ వివరించాలని పార్టీ శ్రేణులకు బండి సంజయ్ పిలుపునిచ్చారు. గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందంటూ మండిపడ్డారు. గవర్నర్ వ్యవస్థను కించపరిచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆచరణ కాని హామీలు ఇచ్చేందుకు, రాష్ర్ట ప్రజలను మరోసారి మోసం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్నారని ఈ సందర్భంగా మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాల్లో సంక్షేమ పథకాలు, హామీల గురించి చర్చ జరగదని అన్నారు. కొత్త కొత్త సంక్షేమ పథకాల పేర్లు చెప్పి.. లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడుతారని ఆరోపించారు.
ఇక.. సచివాలయం నిర్మాణ మూహూర్తంపై కూడా బండి సంజయ్ విమర్శలు చేశారు. తన పుట్టినరోజు నూతన సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా ప్రారంభిస్తారని బండి సంజయ్ ప్రశ్నించారు. నూతన సచివాలయానికి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టిన కేసీఆర్.. సచివాలయం దగ్గరలోనే నిర్మిస్తున్న ఆయన విగ్రహాన్ని మాత్రం పరిశీలించే పరిస్థితి కూడా ముఖ్యమంత్రికి లేదన్నారు.