బీజేపీ, జనసేన కలిసే వుందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ప్రజా వ్యతిరేక విధానాలపై ఇరువురం కలిసే పోరాడుతామని ప్రకటించారు. చంద్రబాబుతో పవన్ కల్యాణ్ మాత్రమే కాదు.. తాను కూడా వివిధ సందర్భాల్లో భేటీ అయ్యానని పేర్కొన్నారు. కలిసి ఉద్యమం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. భవిష్యత్తులో కూడా జనసేన, బీజేపీ కలిసే ప్రయాణం చేస్తుందని సోము వీర్రాజు పేర్కొన్నారు. రాజకీయ అవసరాల కోసం సహజంగా అనేక పార్టీ నేతలను కలుస్తామని.. గతంలో చంద్రబాబును కూడా రాష్ట్రపతికి మద్దతు ఇచ్చిన సమయంలో కలిశామని.. అలా కలిసిన వారందరితో పొత్తు ఉన్నట్లు కాదని సోము వీర్రాజు తెలిపారు. ఇక… బీజేపీ నేత సత్యకుమార్ దాడిపై బీజేపీ అధిష్ఠానం సీనియస్ గానే వుందని సోము వీర్రాజు పేర్కొన్నారు.
ఇక…. ఫిరంగిపురంలో వినాయక విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై కూడా సోము స్పందించారు. ఫిరంగిపురంలో వినాయక విగ్రహాన్ని దుండగులు వినాయక విగ్రహాన్ని ధ్వంసం చేస్తే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదన్నారు. హిందూమతంపై దాడులు జరుగుతుంటే ఒక్కర్నైనా అరెస్ట్ చేశారా? అని ప్రశ్నించారు. ఏపీలో ఎంతో మందిని అరెస్ట్ చేస్తున్నారు కానీ… దేవాలయాలపై దాడులు చేస్తున్న వారిలో ఒక్కరిని కూడా అరెస్ట్ చేయడం లేదన్నారు. ప్రభుత్వ తీరు మారకుంటే.. కపిల తీర్థం నుంచి రామతీర్థం వరకూ యాత్ర చేపడతామని ప్రకటించారు.