ప్రధాని మోదీ బహిరంగ సభకు అన్నీ రెడీ అయ్యాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఆదివారం సాయంత్రం 6 గంటలకు విజయ సంకల్ప సభ జరగబోతోంది. ఈ సభను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. మరో వైపు ఈ సభకు తెలంగాణ మొత్తం నుంచి జన సమీకరణ చేస్తోంది బీజేపీ. ఇప్పటికే పలువురు జాతీయ స్థాయి నేతలకు నియోజక వర్గాలు అప్పజెప్పారు. భారీ జన సమీకరణ ద్వారా తమ బలాన్ని నిరూపించుకునే పనిలో నిమగ్నమైంది. దాదాపు 10 లక్షల మంది తరలి వచ్చేలా రాష్ట్ర నేతలు ప్లాన్ వేసుకున్నారు.
వర్షం పడినా… తడవకుండా వేదికలను ఏర్పాటు చేయించారు. జర్మన్ హ్యాంగర్స్ ద్వారా ఇబ్బందులు లేకుండా చేశారు. సుమారు 3 లక్షల మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. కుర్చీలతో పాటు కింద కూర్చొని వీక్షించడానికి వీలుగా కార్పెట్లు కూడా వేశారు. ఇక… సభా ప్రాంగణం బయట నుంచి సభను వీక్షించేందుకు వీలుగా ఎల్ ఈడీ స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారు. నేతల ప్రసంగాలు 2 కిలోమీటర్ల మేర వినిపించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఇక ఈ సభకు ప్రధాని మోదీ హాజరవుతుండటంతో పరేడ్ గ్రౌండ్ ప్రాంగణాన్ని ఎస్పీజీ తమ ఆధీనంలో తీసుకుంది. 4 వేల మంది పోలీసులతో భారీ భద్రతను సిటీ పోలీసులు చేశారు. ఈ సభ నేపథ్యంలో వివిధ మార్గాల్లో ట్రాఫిక్ ను మళ్లించడంతో పాటు ఆంక్షలు కూడా విధించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో వుంటాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్, జూబ్లీ స్టేషన్, రాష్ట్రపతి రోడ్, సరోజినీ దేవి రోడ్, సర్దార్ పటేల్ రోడ్, బేగంపేట ఎయిర్ పోర్ట్, పంజాగుట్ట, రాజ్ భవన్, జూబ్లీ చెక్ పోస్టు, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో వుంటాయి. ఎక్కడికక్కడ సీసీ టీవీలను ఏర్పాటు చేశారు.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిసిన తర్వాత ప్రధాని మోదీ నోవాటెల్ నుంచి బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి పరేడ్ గ్రౌండ్స్ కు వస్తారు. రోడ్డు మార్గం ద్వారానే రానున్నారు. ప్రధానితో పాటు సభలో పాల్గొనే ఇతర నేతలు కూడా సభలో పాల్గొంటారు. వీళ్లంతా మాదాపూర్ నుంచి పరేడ్ గ్రౌండ్స్ కు వివిధ రూట్లలో రానున్నారు.